వజ్రకరూరు, ఏప్రిల్ 14: అణగారిన వర్గాల ఆశాదీపం, భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar జయంతి వేడుకలు వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం ప్రతినిధి ఎస్.కె. సుబ్రహ్మణ్యం నాయక్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం జాతీయ గౌరవాధ్యక్షులు, సేవాగడ్ ఉపాధ్యక్షులు ఎస్.కె. కేశవ నాయక్ మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం అణగారిన వర్గాలకే కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం లభించేలా రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తుచేశారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, నేటి నాయకులు అంబేద్కర్ ఆశయ సాధనలో నిజమైన కృషి చేయడం లేదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే జయంతి వేడుకలు నిర్వహించి, ఆ తర్వాత అణగారిన వర్గాల అభివృద్ధిని విస్మరిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అవసరమైన పథకాలను తగ్గిస్తూ వారి పురోభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేసినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో దాసు నాయక్, ఉమాపతి నాయక్, మాజీ జెడ్పిటిసి తులసీదాస్ నాయక్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కే.బీకా నాయక్, ఎస్. ఎర్రి స్వామి, గోపాల్ నాయక్, మంగా నాయక్, కే. వెంకటేష్ నాయక్, ఏపీఎస్ఆర్టీసీ అసోసియేషన్ నాయకుడు జి.పి. మంగా నాయక్, దేవల నాయక్, ఎస్. లక్ష్మ నాయక్, డి. తొలిచా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
