ఎంఈఓ తీరుపై సంచలన ఆరోపణలు “కళ్లుండి చూడలేని కబోదిలా వ్యవహారం” – ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దు

Malapati
0

ఉరవకొండ: ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) స్పందించకపోవడంపై ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు తీవ్ర విమర్శలు గుప్పించారు. కళ్లుండి చూడలేని కబోదిలా ఎంఈఓ వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎంఈఓ ఈశ్వరప్ప మౌనం వహించడం అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు.
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ‘హాఫ్ డే’ పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, ఉరవకొండలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఏవీఆర్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా, ఎంఈఓ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
అదేవిధంగా, నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ల ప్రచారం సాగుతున్నా, విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ముడుపుల వ్యవహారం ఉందని ఆరోపించారు. “మీ వాటా మీకు అందితే చాలు.. విద్యార్థుల ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎంఈఓపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని సిద్దు పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఎంఈఓ ఈశ్వరప్పపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
లేకపోతే ఏఐఎఫ్‌డీఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!