అమరావతి అభివృద్ధిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన సలహాపై టీడీపీ స్పందించింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు వేగంగా నిర్మించి తర్వాత అభివృద్ధి చేయాలన్న ఆయన వ్యాఖ్యలను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బహిరంగ లేఖ ద్వారా ఖండించారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవైనా, వాటి ఎదుగుదలకు ప్రభుత్వాల దూరదృష్టి పెట్టుబడులే కారణమని వెంకన్న పేర్కొన్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారడానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే కీలకమని ఆయన గుర్తు చేశారు.
అప్పుడు విమర్శలు ఎదురైనా, అదే హైటెక్ సిటీ ఇప్పుడు లక్షల ఉద్యోగాలు, అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని ఆయన చెప్పారు. అదే విధంగా అమరావతి విషయంలో కూడా దీర్ఘకాల దృష్టితో ముందుకు వెళ్లాలని టీడీపీ వాదిస్తోంది.అమరావతిని తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని బుద్దా వెంకన్న తన లేఖలో పేర్కొన్నారు.


