అనంతపురం : ఉరవకొండలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న మహానందికి వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్న ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
![]() |
| ఉరవకొండ సీఐ మహానందికి ప్రజా సంఘాల ఘన సన్మానం |
గతంలో రాయదుర్గంలో విధులు నిర్వహించిన సమయంలో మహానంది అందించిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థలో ప్రజలకు చేరువగా ఉండే అధికారుల అవసరం ఎంతైనా ఉందని, ఆ పాత్రను మహానంది సమర్థంగా పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఉరవకొండ అర్బన్ సీఐగా విధులు నిర్వహిస్తూనే రూరల్ సర్కిల్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న మహానంది పనితీరును పలువురు ప్రశంసించారు. రెండు విభాగాల బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ నేర నియంత్రణలో చురుకుగా వ్యవహరిస్తున్నారని సామాజిక కార్యకర్త మీనుగ మధుబాబు తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ మాలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ, “పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి మహానంది ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్బన్, రూరల్ రెండు విభాగాలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఇటీవల నిర్వహించిన పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మహానంది ఆధ్వర్యంలో నిర్వహించిన బందోబస్తు ఏర్పాట్లు కూడా భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొన్న వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని సమన్వయం చేసి సమర్థవంతంగా నిర్వహించారని భక్తులు తెలిపారు.
పామిడి, రాయదుర్గం, ఉరవకొండ వంటి ప్రాంతాల్లో పనిచేసిన కాలంలో ప్రజలతో మమేకమవుతూ ఆయన అందించిన సేవలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే ఇలాంటి అధికారులు పోలీస్ శాఖకు ఆదర్శమని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు.

