ఎనిమిది కిలోమీటర్ల మేర అడుగడుగునా గుంతలు
నిత్యం వాహన ప్రమాదాలు.. భయపడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
వజ్రకరూర్:
గ్రామీణ రహదారులకు మోక్షం ఎన్నడో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. మండల పరిధిలోని వజ్రకరూర్ మీదుగా చింతలాంపల్లి రైల్వే గేట్ వరకు ఉన్న సుమారు ఎనిమిది కిలోమీటర్ల ప్రధాన రహదారి ప్రస్తుతం నరకానికి నకలుగా మారింది. అడుగడుగునా వెలిసిన గుంతలు, తేలిన కంకర రాళ్లతో ఈ దారి గుండా ప్రయాణించాలంటేనే వాహనచోదకులు వణికిపోతున్నారు.
ప్రమాదాల పొంచి ఉన్న ప్రయాణం:
ఈ 8 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు పూర్తిగా దెబ్బతిని, మట్టి రోడ్డును తలపిస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు నిత్యం అదుపుతప్పి కిందపడుతూ తీవ్ర గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళల్లో మరియు అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లే గర్భిణులు, రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో రేగుతున్న దుమ్ముతో వెనుక వచ్చే వాహనదారులకు దారి కనిపించక ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి.
రోడ్డు వేయాలని స్థానికుల డిమాండ్:
ఈ రోడ్డు పరిస్థితిపై స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా, నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ రహదారిని బాగు చేయాలనే కనీస ఆలోచన అధికారులకు లేకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, తక్షణమే నిధులు మంజూరు చేసి వజ్రకరూర్ - చింతలాంపల్లి రైల్వే గేట్ రహదారిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.




