విడపనకల్లు:
ఐసీడీఎస్ ఉరవకొండ ప్రాజెక్ట్ పరిధిలోని విడపనకల్లు మండలం, పాల్తూరు గ్రామంలో "అంగన్‌వాడి పిలుస్తోంది", "కిశోరి వికాసం" కార్యక్రమాల్లో భాగంగా భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామంలోని తల్లిదండ్రులను కలిసి, ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్‌వాడి కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు వీలుగా అంగన్‌వాడి కేంద్రాల్లో నర్సరీ, ఎల్‌కేజీ , యూకేజీ తరగతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా వివరించారు.
*జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి:*
దీనితో పాటు నిర్వహించిన ‘కిశోరి వికాసం’ కార్యక్రమంలో కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. బాలికలు శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని, జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచించారు. జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వయస్సు-ఎత్తుకు మించి బరువు పెరిగి 'అతి బరువు' బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గ్రామంలో నిర్వహించిన ఈ విస్తృత అవగాహన కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు దుర్గ, లక్ష్మిదేవి, మల్లేశ్వరి, నాగవేణి, ఆదిలక్ష్మి, మరియు రాధ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.


