ఉరవకొండలో తాగునీటి కష్టాలు.. 10వ వార్డులో ప్రజల ఆగ్రహం

Malapati
0

ఉరవకొండ, ఏప్రిల్ 17: నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. వేసవి వేడిమి పెరుగుతున్న వేళ సామాన్య ప్రజలకు గుక్కెడు నీరు కూడా అందని పరిస్థితి నెలకొనడంతో 10వ వార్డు వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి సమీక్షల పేరిట అధికార, రాజకీయ నేతల హడావిడి కొనసాగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
పట్టణంలోని 10వ వార్డులో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక రాత్రి 10:30 గంటల సమయంలో నీటిని విడుదల చేయడం వల్ల స్థానికులు నిద్ర మానుకొని నీటి కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయపాలన లేకపోవడంతో నీరు వృథా అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఉరవకొండ పట్టణంలో నీటి ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్ వంటి మౌలిక చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు పేర్కొంటున్నారు. ఏ వార్డుకు ఎప్పుడు నీరు సరఫరా అవుతుందో స్పష్టత లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ తాగునీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేసవి ప్రారంభమైనప్పటి నుంచే సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ పరంగా కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. గత ఎన్నికల నుంచి కొనసాగుతున్న రాజకీయ వివాదాల మధ్య సామాన్యుడు మాత్రం మౌలిక అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. “ఓటేశాం.. ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నాం” అనే స్థాయిలో ప్రజల ఆవేదన వ్యక్తమవుతోంది.
తక్షణమే గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను సరిచేసి, సమయపాలనతో నీటి పంపిణీ చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!