రమణ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, వ్యవసాయ రాబడికి అనుగుణంగా ఫలితాలు రావడం లేదని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయాలను ఉదహరించినట్లు పేర్కొన్నారు. ప్రతి సేవకూ యూజర్ ఛార్జీలు వసూలు చేయాలన్న భావన ప్రభుత్వ రంగంలో అమలు చేయడం కష్టమని, అందుకే ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారని ఆరోపించారు.
విద్య, వైద్యం వంటి కీలక రంగాలతో పాటు ప్రాజెక్టుల నిర్వహణను కూడా ప్రైవేటు చేతులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ భారాన్ని ప్రభుత్వం భరించలేక ప్రైవేటు భాగస్వామ్యానికి మొగ్గుచూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక రాయలసీమకు జీవనాధారమైన హంద్రీ–నీవా ప్రాజెక్టు విషయంలో వేగంగా పనులు చేపట్టడం వెనుక కూడా భవిష్యత్‌లో ప్రైవేటీకరణ వ్యూహం దాగి ఉందని రమణ ఆరోపించారు. ప్రాజెక్టులపై నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నీటి వినియోగానికి ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను రైతు సంఘాలకు లేదా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుండి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.

