రాయదుర్గం : అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాయదుర్గం నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఏపీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షుడు కుమార్ అధ్యక్షత వహించారు.
జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని తెలిపారు. ఇటీవల రాయదుర్గం పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కలిసినప్పుడు, ఖాళీల గురించి అడిగితే “అన్ని పోస్టులు భర్తీ అయ్యాయి” అని చెప్పారని ఆరోపించారు.
అయితే, వాస్తవానికి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 96 పోస్టులు ఉండగా, కేవలం 66 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలోనూ, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు లక్ష ఉద్యోగాల భర్తీ కూడా చేయలేదని తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ అంశంపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు విడుదల చేయాలని, అంబులెన్స్ సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆసుపత్రి ఎదుట సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు నాగయ్య, దినాకర్, గంగాధర, రాజు, రమేష్, నాగరాజు, అంజప్ప, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


