శ్రీశైలం ఘాట్‌లో బస్సు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన వాహనం

 TRUE TIMES INDIA
0

 దోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బస్సులు అదుపుతప్పడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఒక ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లగా, మరో బస్సు రక్షణ రైలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.

మార్కాపురం డిపోకు చెందిన APSRTC బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ఎదురుగా వచ్చిన వాహనాలకు సైడ్ ఇవ్వడానికి ప్రయత్నించే క్రమంలో బస్సు రోడ్డు మార్జిన్‌ దిగింది. అదే సమయంలో వర్షపు జల్లులు పడటం, వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.

దీంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రిటైనింగ్ వాల్‌ను దాటి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఉన్న పెద్ద చెట్లను ఢీకొని బస్సు ఆగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.సమయంలో ఆ బస్సు వెనుక వస్తున్న మరో ప్రైవేట్ బస్సు కూడా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఇనుప కమ్మీలను ఢీకొట్టి నిలిచిపోయింది. ఆ బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు కూడా తీవ్ర భయానికి గురయ్యారు.

ఈ ప్రమాదంలో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘాట్ రోడ్డులో వర్షకాలంలో జారుడు పరిస్థితులు ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!