ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంకుర (స్టార్టప్) సంస్థలను త్వరలో ఎంపిక చేసి ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. నాలుగు కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన మొత్తం 12 సంస్థలకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నారు. అదేవిధంగా అత్యుత్తమ సంస్థకు రూ.1 కోటి విలువైన ‘వర్క్ ఆర్డర్’ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐటీ శాఖ జారీ చేసిన జీఓ నెం.33 ప్రకారం ప్రత్యేక కమిటీ ద్వారా సంస్థల పనితీరును పరిశీలించి ఉత్తమ సంస్థలను ఎంపిక చేయనున్నారు. డయాగ్నస్టిక్ టూల్స్, పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్, స్మార్ట్ మానిటరింగ్ & వేరబుల్స్, రిమోట్ కేర్ టెలిమెడిసిన్ వంటి నాలుగు విభాగాల్లో ఈ సంస్థలు తమ సేవలను అందించాయి.మొత్తం 297 అంకుర సంస్థల నుంచి దరఖాస్తులు రాగా, మూడు దశల పరిశీలన తర్వాత 18 సంస్థలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు 37 రోజుల్లో ఈ సంస్థలు 12,677 మంది రోగులకు వైద్య సేవలు అందించాయి.
పరీక్షల ఫలితాల ప్రకారం, వేలాది మంది రోగుల్లో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉదాహరణకు, టీబీ, గ్లూకోమా, సర్వైకల్ క్యాన్సర్, గుండె సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం సాధ్యమైంది. నవజాత శిశువుల్లో శ్వాస సమస్యలు గుర్తించడం, గర్భంలోని శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వంటి సేవలు కూడా అందించారు.
ఇక AI స్క్రైబ్ సాంకేతికత ద్వారా వైద్యులు రోగులతో మాట్లాడే సమయంలో సుమారు 70 శాతం వరకు సమయం ఆదా అయినట్లు వెల్లడించారు. ఈ విధానం వైద్య సేవల వేగం, నాణ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 18 అంకుర సంస్థల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో AI సేవలను అమలు చేయడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో AI ఆధారిత సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
త్వరలో అమరావతిలో ప్రత్యేక సదస్సు నిర్వహించి ఈ ప్రాజెక్ట్ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ సదస్సుకు వైద్యులు, విద్యార్థులు, జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.

