ఉరవకొండ : అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగి, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల వంటి అంశాలపై చర్చించారు.
సమావేశానికి మండల అధ్యక్షుడు నవీన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. “జాబ్ క్యాలెండర్ కావాలి, జాబ్‌లెస్ క్యాలెండర్ కాదు” అంటూ యువత ఎదురుచూపులను ప్రభుత్వం గౌరవించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డాక్టర్లు, స్టాఫ్ నర్స్ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని నాయకులు విమర్శించారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రకటించినప్పటికీ, బకాయిల చెల్లింపులపై స్పష్టత లేకపోవడం, రేషన్ వాహనదారుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి ఉన్నదని సమావేశంలో ప్రస్తావించారు. నిరుద్యోగ యువతను ఆదుకునే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.ఐదేళ్లలో ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చేసిన హామీలకు విరుద్ధంగా ఇప్పటివరకు గణనీయమైన నియామకాలు జరగలేదని నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోందని అన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా యువతను సమీకరించి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని AIYF నిర్ణయించింది. మే నెలలో శిక్షణా తరగతులు నిర్వహించి ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని సమావేశం ద్వారా తీర్మానించారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు హస్సేన్ భాష, చందు, రఘు, పండు, వేణు, మహేష్, తేజ, మహేంద్ర నాయక్, రాజు, అంజి, మధు తదితరులు పాల్గొన్నారు.

