ఉరవకొండ, ఏప్రిల్ 16: తెలుగు జాతి గర్వించదగ్గ సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం 178వ జయంతి వేడుకలు ఉరవకొండ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వర్యంలో రూపానాయక్ తండాలోని సామా సంఘ్ మహారాజ్ దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సానీక్ష ఫౌండేషన్ చైర్మన్ శివ ధానవత్ మాట్లాడుతూ, సమాజంలోని అన్యాయాలపై నిర్భయంగా పోరాడిన మహానుభావుడు వీరేశలింగం పంతులువారని కొనియాడారు. మహిళా విద్యా అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని, బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించి విద్యా విస్తరణకు మార్గం సుగమం చేశారని తెలిపారు.
అలాగే, అంటరానితనం వంటి సామాజిక కురీతులను నిర్మూలించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజాన్ని చైతన్య పరిచిన ఉద్యమ సింహంగా ఆయనను అభివర్ణించారు.
జయంతి సందర్భంగా దేవాలయ ఆవరణలో మొక్కలు నాటి ఆయనకు నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
