ఉరవకొండ, ఏప్రిల్ 16: మండల పరిధిలోని రాయంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాయంపల్లి అంగన్‌వాడీ కేంద్రం–1లో కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న తిమ్మక్క (60) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తిమ్మక్క చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదీర్ఘకాలంగా అంగన్‌వాడీ సేవలో నిబద్ధతతో పనిచేసిన ఆమె మృతి పట్ల సహచర సిబ్బంది, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతురాలి భౌతికకాయాన్ని ఉరవకొండ ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, సూపర్‌వైజర్ అరుణ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు అశ్వర్థమ్మ, జ్యోతి, పద్మ, మంజుల, నాగరత్నమ్మ, అరుణమ్మతో పాటు ఆయాలు కూడా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రభుత్వం తరఫున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.15,000 నగదును సీడీపీఓ శ్రీదేవి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
సేవాభావంతో గ్రామీణ మహిళా సంక్షేమంలో కీలక పాత్ర పోషించిన తిమ్మక్క మృతి స్థానికంగా తీవ్ర లోటును మిగిల్చిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
