కడప : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా వేద ఆశీర్వచనం అందించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం ఒంటిమిట్టకు చెందిన అర్చకులు ఎ. శ్రావణ కుమార్, వీణా మనోజ్ కుమార్, అలాగే రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయ సిబ్బంది కె. పార్థసారథి మంగళవారం పులివెందులలోని మాజీ సీఎం నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా వారు జగన్‌కు శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు సమర్పించి వేద ఆశీర్వచనం అందించారు. ఈ చర్యలను టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి ఎ. ప్రశాంతి సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువులో సమాధానం ఇవ్వకపోతే లేదా సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దేవాలయాలకు చెందిన అర్చకులు అధికారిక విధుల్లో ఉన్నప్పుడు లేదా దేవస్థానం పరిధికి సంబంధించిన వ్యవహారాల్లో నిబంధనలు పాటించాల్సి ఉంటుందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే పరిపాలనాత్మక చర్యలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక ఈ ఘటనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ చర్యలను సమర్థిస్తుండగా, మరికొందరు అర్చకులపై తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
మొత్తంగా ఈ పరిణామం రాష్ట్రంలో దేవాలయ పరిపాలన, నిబంధనలు, అర్చకుల వ్యవహార శైలిపై మరోసారి చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ కేసులో టీటీడీ తీసుకునే తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.

