ఉరవకొండ: స్థానిక గాంధీబజార్‌లోని శ్రీ పేట బసవేశ్వర ఆలయంలో విశ్వగురు శ్రీ బసవేశ్వరుని 893వ జయంతి మహోత్సవాలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ గవిమఠ సంస్థాన ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి వారితో పాటు ఉరవకొండ తహశీల్దార్ బోగన్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం, ఆకు పూజ, మహా మంగళహారతి వంటి విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి దర్శనం పొందుతూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
అనంతరం నిర్వహించిన సభలో శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి ప్రసంగిస్తూ, బసవన్న బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలోని మూఢాచారాలను నిర్మూలించేందుకు బసవన్న తన వచనాలను ఆయుధాలుగా ఉపయోగించారని ఆయన వివరించారు. “దయలేని ధర్మం ఎందుకు? సకల జీవుల పట్ల దయ కలిగి ఉండటమే నిజమైన ధర్మం” అనే బసవన్న సూక్తి నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వం సాధించడంలో బసవన్న చేసిన కృషి అపూర్వమని స్వామిజీ కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ స్వయంగా శివపూజ చేసుకునే విధంగా ‘ఇష్టలింగ’ ఆవిష్కరణ ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని తెలిపారు.అణచివేతకు గురైన వర్గాలకు గొంతుకనిచ్చేందుకు బసవన్న స్థాపించిన ‘అనుభవ మంటపం’ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిందని స్వామిజీ చెప్పారు. ఇది సమాజంలో సమానత్వ భావనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని వివరించారు.అలాగే “కాయకవే కైలాస” అనే బసవన్న సందేశాన్ని ఉటంకిస్తూ, ప్రతి ఒక్కరూ శ్రమను గౌరవించి కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి కృషి, నిబద్ధత ముఖ్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ సభ్యులు పాటిల్ నాగన్న గౌడ్, నిరంజన గౌడు పాటిల్, ఆర్డీటీ మల్లికార్జున, దేశాయి గంగాధర్, బొజ్జప్ప, సత్యనారాయణ, వీరేష్, బేకరీ రుద్రన్న, బసవరాజ్, మల్లికార్జున పాటిల్, రామ్మోహన్, మిట్ట రవి ప్రకాష్ గౌడ్, విజయ్ కుమార్, నాగరాజు, సుధాకర్ రెడ్డి, కార్తీక్ మఠం, మంజు, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
