రేణిగుంట, మే 9: భారత ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు తిరుమల శ్రీవారి దర్శనార్థం రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో అధికార యంత్రాంగం వారికు ఘన స్వాగతం పలికింది.
విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఐఏఎస్ పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుమల వరకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాన్వాయ్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అధికారులు స్వయంగా పర్యవేక్షించారు. అధికారుల స్వాగతం అనంతరం జ్ఞానేష్ కుమార్ దంపతులు కారులో తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

