బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజ్ సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ, సమాజంలోని అసమానతలు, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రజ్యోతి విలేకరి హత్య ఘటన మరువకముందే, మరో జర్నలిస్టుపై దాడి జరగడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందన్నారు.
జర్నలిస్టులు నిజానిజాలు వెలికితీస్తూ ప్రజల తరఫున పనిచేస్తున్నారని, అలాంటి వారిపై దాడులు జరగడం సమాజానికి మంచిది కాదని వారు పేర్కొన్నారు. ఏదైనా వార్తపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కానీ స్వయంగా యాజమాన్యం రౌడీలతో కలిసి జర్నలిస్టు ఇంటికే వెళ్లి దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు.ఈ ఘటనలో జర్నలిస్టు లక్ష్మీనారాయణతో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా దాడి జరగడం దారుణమని, చిన్నపిల్లవాడిని కూడా వదిలిపెట్టకుండా లాగిపారేయడం వంటి ఘటనలు అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు సమాజంలో భయాందోళనలు సృష్టిస్తాయని తెలిపారు.
ప్రస్తుతం బీఎస్పీ నాయకులు “చలో ఆకువీడు” కార్యక్రమంలో పాల్గొంటున్నందున, సోమవారం ఈ ఘటనపై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని బీఎస్పీ నేతలు మరోసారి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీడియాకు రక్షణ అత్యవసరమని వారు స్పష్టం చేశారు.


