ఉరవకొండ
మనిషికి సాయం చేయాలన్న ఆ వృద్ధుడి ఆలోచనే ఆయనకు శాపమైంది. కేవలం బ్యాంకు ఖాతా తెరవడానికి 'పరిచయ సంతకం' అని నమ్మించి, శ్రీమతి కృష్ణ వేణి, మేకల సుబ్బు అతడిని రూ. 10 లక్షల అప్పుకు బాధ్యుడిని చేసిన దంపతుల నయవంచన ఉరవకొండలో సంచలనం రేపుతోంది. తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము కూడా చేతికి అందక, న్యాయం కోసం ఆ వృద్ధుడు అధికారుల చుట్టూ తిరుగుతున్న వైనం స్థానికులను కలచివేస్తోంది.
నమ్మించి గొంతు కోశారు..
స్థానిక నివాసి, సీనియర్ జర్నలిస్ట్ మాలపాటి శ్రీనివాసులు (65) వద్దకు గతంలో ఉరవకొండలో "శ్రీ హనుమాన్ ఎంటర్ప్రైజెస్" నడిపిన కృష్ణవేణి, మేకల సుబ్బు దంపతులు వచ్చారు. బ్యాంకులో కరెంట్ ఖాతా తెరవడానికి తెలిసిన వ్యక్తిగా సంతకం పెట్టాలని కోరారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాసులు సంతకం చేయగా, ఆ దంపతులు తెలివిగా దానిని వ్యాపార రుణానికి జామీను' సంతకముగా మార్చి వాడుకున్నారు.
కుమార్తె పెళ్లి వేళ నిలిచిన డిపాజిట్లు
రుణం తీసుకున్న దంపతులు అప్పు తీర్చకపోవడంతో వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ. 10 లక్షలకు చేరింది. దీంతో బ్యాంకు అధికారులు అసలు నిందితులను వదిలేసి, జామీనుగా ఉన్న శ్రీనివాసులు వ్యక్తిగత ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం తన కుమార్తె వివాహం నిశ్చయమవడంతో, ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లిన బాధితుడికి బ్యాంకు షాక్ ఇచ్చింది. అప్పు తీరితే తప్ప డిపాజిట్లు ఇవ్వమని తేల్చి చెప్పడంతో శ్రీనివాసులు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.
పోలీసులను సైతం బుకాయిస్తూ..
ఈ మోసంపై బాధితుడు ఫిబ్రవరిలో 'స్పందన' ద్వారా పోలీసులను ఆశ్రయించగా, నిందితుడు మేకల సుబ్బు పోలీసుల ముందే "నెల రోజుల్లో అప్పు తీరుస్తాను" అని రాతపూర్వక హామీ ఇచ్చాడు. కానీ గడువు ముగిసినా రూపాయి చెల్లించకపోగా, బాధితులను, అధికారులను సైతం బుకాయిస్తూ తిరుగుతున్నాడు. బాధితుల సొమ్ముతో నిందితులు ఇతర ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
తహశీల్దార్‌కు ఫిర్యాదు..
పోలీసుల గడువు ముగిసినా న్యాయం జరగకపోవడంతో, బాధితుడు సోమవారం ఉరవకొండ తహశీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్‌ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేశారు.
* నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,
* తన కుమార్తె పెళ్లి అవసరాల దృష్ట్యా తన సొంత డిపాజిట్లపై ఉన్న 'హోల్డ్' తొలగించాలని,
* మోసగాళ్ల ఆస్తులను విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.


