ఆకాశంలో సగం భాగం
ఏమీ అందుకోలేని అనాధలం!
మొత్తం రాష్ట్ర జనాభా 5.31 కోట్లు,అందులో బీసీలు 2.68 కోట్లు అంటే రాష్ట్ర జనాభాలో 50.59 శాతం,అంటే సగభాగం.
బీసీలలో 138 కులాలు ఉన్నాయి,వాటిని ఐదు కేటగిరీలుగా విభజించారు బీసీ(ఏ) 51,బీసీ( బి )27, బిసి(సి) 1,బి సి( డి) 45,కులాలు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఆకాశంలో సగం భాగం.కానీ అనేక కులాలు,ఉప కులాలుగా విభజించబడి రాజకీయ పార్టీలకు తాబే దారులుగా,ఓటర్లుగా ఉపయోగపడుతూ రాజకీయంగా అణగద్రొక్క బడుతున్నారు.
స్వాతంత్ర్యానంతరం ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి లేడంటే ఎంత ఆశ్చర్యం,ఎంత దారుణం,ఎంత అణచివేత.
పిల్లలకు పప్పులు పెట్టి పోరుమాన్పినట్టు,రాజకీయ పార్టీలు తమకు తాబేదారులుగా ఉంటున్న కొంతమంది బీసీలకు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు అరకొరగా కేటాయించి,సంతృప్తి పరచి,బీసీల ఓట్లను కొల్లగొట్టి అగ్రవర్ణ పెత్తందారులు అధికారాన్ని అనుభవిస్తూ బీసీలు పాలితులే గాని పాలకులు కాదని బహిరంగంగా చెబు తుంటే,సిగ్గు విడిచి,చావ చచ్చి బ్రతుకుతున్నారు.
సంపద సృష్టించేది బీసీలు ఆ సంపదను అనుభవించేది అగ్ర వర్ణాలు,ఓట్లు బీసీలవి సీట్లు,అధికారం ఓసీలది. శ్రామిక శక్తిలో మాత్రమే బీసీల భాగస్వామ్యం,ఆదాయమంతా అగ్రవర్ణాలకే.
ఈ రాష్ట్రంలో మొట్ట మొదట బీసీలను, బహుజనులను నా ఎస్సీ,నా ఎస్టి,నా బిసి,నా మైనారిటీ అని అక్కున చేర్చుకున్న ఏకైక పార్టీ వైసిపి అని చెప్పవచ్చు,అక్కున చేర్చుకోవడమే కాకుండా ఆ ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో,మంత్రివర్గంలో, రాజ్యసభ కు పంపిన వారిలో, నామినేటెడ్ పోస్టులలో,పార్టీ పదవులలో సగభాగానికి పైగా బహుజనులకు అవకాశం కల్పించడం జరిగింది.అందుకే ఆ పార్టీని ఐదు సంవత్సరంలలోనే అగ్రవర్ణ పెత్తందారులు కక్ష గట్టి ఓడించారు,ఇది బహుజనుల ఓటమే.
అంబేద్కర్ మహనీయుడు చెప్పినట్లు చట్టసభల్లో ప్రాతినిత్యం లేని జాతులు నశిస్తాయి,దేశంలో, రాష్ట్రంలో బీసీలకు జనాభాకు తగ్గట్టుగా సామాజిక,ఆర్థిక,రాజకీయ భాగస్వామ్యం లేని కారణంగా అనేక బీసీ జాతులు నశించి పోయే దశకు చేరుకున్నాయి,ఇప్పటికైనా బీసీలు,బహు జనులు గుర్తెరిగి,చైతన్యవంత మైన ఐక్యతతో రాజ్యాధికారం కోసం అడుగులు వేయాలి,ఓట్లు మావి,సీట్లు మావి,అధికారం మాదే నని నినదించాలి.

