సి డబ్ల్యూ సి ప్రతిపాదనలు అత్యంత ప్రమాదకరం!

Malapati
0


 


రాయలసీమకు ఉరి

       కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి,తమ స్వార్ధ రాజకీయాల కోసం ఎంతవరకైనా వెళ్లడానికి, ఒక రాష్ట్ర ప్రయోజనాలను మరొక రాష్ట్రానికి ఫణంగా పెట్టడానికి సిద్ధమైంది.

    కర్ణాటకలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం ఆ ప్రభుత్వం అక్రమంగా 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న *అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు* గా ప్రకటించి,50 వేల కోట్లు ఖర్చు చేయడానికి పూనుకోవడం.

     ఎగువ నున్న కృష్ణా ఉపనదుల నుంచి శ్రీశైలం డ్యామ్ కు ప్రవాహం రాకుండా ఆపేయడంలో భాగంగా ఎగువన కర్ణాటక 295 టీఎంసీలకు మించి వాడుకోకూడదని కే డబ్ల్యూ టి 1 చెప్పినా,ఖాతరు చేయకుండా దాదాపు 320 టీఎంసీలను వాడుకుంటున్నా సి డబ్ల్యూ సి మాట్లాడకపోవడం.

     అలాగే కృష్ణా నదికి ఉపనదులైన తుంగభద్ర, భీమా ప్రవాహాలను సైతం ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో భాగంగా బీమాపై కర్ణాటకలోని కల్బుర్గి జిల్లా,సొంతి వద్ద బ్యారేజ్ తో పాటు ఎత్తిపోతలను శరవేగంగా చేస్తున్నది,భీమా నదిలో 15 టీఎంసీలకు మించి వినియోగించ కూడదని బచావత్ ట్రిబ్యునల్,

కే డబ్ల్యూ డి టి 1 నిర్దేశించినా అంతకంటే ఎక్కువ నీటినే వినియోగించుకుంటున్నది. ఇప్పుడు మరలా సొంతి బ్యారేజీ,ఎత్తిపోతలను 1000 కోట్లతో నిర్మించి,భీమా నదీ జలాలను నాలుగు టీఎంసీలు తరలిస్తున్నామని పైకి చెప్పుతున్నప్పటికినీ అంతర్గతంగా పది టీఎంసీలు పైగానే తరలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సిడబ్ల్యుసి వంత పాడుతూ సొంతి బ్యారేజీ,ఎత్తిపోతలకు అనుమతితో పాటు మార్చి 25న సిడబ్ల్యుసి సాంకేతిక సలహా మండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి,అయినా చంద్రబాబు సర్కార్ మౌనంగా ఉన్నది. 

      బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నట్లుగానే 2023 లో తెలంగాణ ఎన్నికలలో అక్కడి ప్రజల మన్ననలను పొంది గెలవడానికి *కృష్ణా జలాల పునః పంపిణీ* కి సిద్ధమై ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం, 

    నేడు మరలా తెలంగాణలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి కృష్ణా నికర జలాలను 123 టీఎంసీలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్,గోదావరి నీటిని పోలవరం-నల్లమల సాగర్ ద్వారా 123 టీఎంసీలు ఆంధ్రకు ఇవ్వడానికి తెలంగాణ ఒప్పుకుంటే నదుల అనుసంధానం సులభంగా జరిగి పోతుందని సి డబ్ల్యూ సి చిలక పలుకులు పలుకుతున్నది.ఈ ఒప్పందం వల్ల మన ఇంటిముందు ఉండి,హక్కుగా రావాల్సిన నికరజలాలను తెలంగాణకు వదులుకొని,ఎక్కడో ఉన్న గోదావరి మిగులు జలాలను సమ్మక్క సారక్క బ్యారేజి నుంచి కావేరి వరకు అనుసంధానం చేయడం అంటే ఒక రకంగా ఇంటిలో నీళ్లను ఇతరులకు దానం చేసి ఎక్కడో పోతున్న వరద నీటిని 80,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి తెచ్చుకోవడం ఆంధ్రప్రదేశ్ కు పెనుభారం.

     2014 విభజన చట్టంలో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు జీవనాడులుగా ఉన్న హంద్రీ-నీవా,గాలేరు-నగరి ప్రాజెక్టులను ప్రభుత్వ నిధులతో వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఉన్నది.ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం వీటిని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి కేంద్రమే పూర్తి చేయాలని అడగకపోవడం రాయలసీమ ద్రోహమే.అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో సి డబ్ల్యూ సి ప్రతిపాదనలను వ్యతిరేకించాలి.కృష్ణా నదిపై అక్రమంగా నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి.లేకుంటే రాయలసీమ ఎడారే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!