పత్రికలో పని లేకపోయినా అక్రెడిటేషన్ కార్డు..! భారీగా వసూళ్లు చేస్తున్న ముఠాలు
నిజమైన విలేకరులకు అన్యాయం.. డబ్బున్నవారికి అక్రెడిటేషన్ వరం!
జిల్లాకు సంబంధం లేని వారికి డబ్బులకు కార్డులు ఇస్తున్నారంటూ విమర్శలు.
అనంతపురం:అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వివాదం నెలకొంది. కొన్ని కొత్త పత్రికల పేరుతో జిల్లాకు సంబంధం లేని వ్యక్తులకు, అక్కడ ఎలాంటి మీడియా కార్యకలాపాలు నిర్వహించని వారికి డబ్బుల ఆధారంగా అక్రెడిటేషన్ కార్డులు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అర్హతలను పక్కనపెట్టి అక్రెడిటేషన్ కార్డులు జారీ అవుతున్నాయనే అంశం జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఫీల్డ్‌లో పనిచేస్తున్న విలేకరులకు అవకాశాలు తగ్గిపోతుండగా, కొందరు మధ్యవర్తుల ద్వారా కార్డులు పొందుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి అక్రమాల వల్ల నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రెడిటేషన్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, సమాచార శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
