ఉరవకొండలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: మాలమహానాడు డిమాండ్*


 

ఉరవకొండ, మే 18 ఉరవకొండ పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా అరికట్టి, నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు ప్రకాష్ స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఒక వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు లోపాల వల్ల పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక హోటళ్లు, కిరాణా దుకాణాలు, కూరగాయలు మరియు పండ్ల మార్కెట్లలో ఆహార పదార్థాల ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ కవర్లను విరివిగా వాడుతున్నారని పేర్కొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, ప్రజలు రకరకాల భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని ఆయన హెచ్చరించారు. పర్యావరణాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పంచాయతీ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు, వినియోగంపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.