భూ సమస్యలపై అనంతపురం కలెక్టర్ సీరియస్: నలుగురు తహశీల్దార్లకు కీలక ఆదేశాలు!

Malapati
0




 

అక్రమ ఆక్రమణలు, నిషేధిత భూముల జాబితాపై తక్షణమే విచారణ జరపాలని ఉత్తర్వులు.


అనంతపురం జిల్లా పరిధిలోని పలు మండలాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు మరియు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, తీవ్రంగా స్పందించారు. బాధితులు, సామాజిక కార్యకర్తల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల తహశీల్దార్లను ఆదేశిస్తూ కలెక్టర్ కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు (L.Dis.No.E1/1550/2026) జారీ అయ్యాయి.

కళ్యాణదుర్గం, గుంతకల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని నాలుగు ప్రధాన భూ సమస్యలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

ఉరవకొండలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆర్టీఐ సెక్రటరీ ఫిర్యాదు

ఉరవకొండ పట్టణంలోని ఐటీఐ కాలేజీ వెనుక భాగంలో ఉన్న 1.90 ఎకరాల ప్రభుత్వ భూమిని, అలాగే దేవాంగ కల్యాణమండపం ముందు వైపు ఉన్న 1.30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, కొండ వెనుక భాగంలోని మరో 0.30 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించారని సమాచార హక్కు చట్టం జిల్లా జనరల్ సెక్రటరీ మీనుగ మధుబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఆ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా కల్యాణమండపం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని ఉరవకొండ తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.

గుత్తిలో అక్రమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కలకలం

గుత్తి మండలం బచ్చుపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం రావుకు చెందిన సర్వే నెం. 177 లోని 0.19 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు అనధికారికంగా, తప్పుడు మార్గాల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, బాధితుడి పేరును వెంటనే పునరుద్ధరించాలని గుత్తి తహశీల్దార్‌కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

నిషేధిత జాబితా (22-A) నుండి భూముల తొలగింపునకు దరఖాస్తులు

 కళ్యాణదుర్గం మండలం: హులికల్లు గ్రామంలోని సర్వే నెం. 98-3 లో గల 7.30 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చట్టం-1908 లోని సెక్షన్ 22-A (ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ) జాబితా నుండి తొలగించాలని కె. తిప్పేస్వామి, కె. దొనస్వామి దరఖాస్తు చేసుకున్నారు.

 వజ్రకరూర్ మండలం: తట్రకల్లు గ్రామంలోని సర్వే నెం. 368 లో గల 7.00 ఎకరాల భూమిని కూడా నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఎం. మల్లికార్జున కోరారు.

కలెక్టర్ కార్యాలయం హెచ్చరిక ఈ నాలుగు అంశాలపై ఆయా మండలాల తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, అమలులో ఉన్న రెవెన్యూ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుని, పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!