యాడికి వ్యవసాయ శాఖలో సమాచార నిరాకరణ: జేడీఏకు మొదటి అప్పీల్!

Malapati
0


 

లబ్ధిదారుల జాబితాపై గోప్యత ఎందుకు? అధికారుల తీరుపై మండిపడుతున్న రైతాంగం.

యాడికి మండల వ్యవసాయ శాఖ పరిధిలో ప్రభుత్వ పథకాల పంపిణీ, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కరువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నుండి సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను ఇవ్వడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, బాధితుడు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచారకులు కు అధికారికంగా అప్పీల్ చేశారు.

 అసమగ్ర సమాచారంతో కాలయాపన:

యాడికి మండలం, పెందేకల్లు గ్రామానికి చెందిన పౌరుడు ఎమ్. నారాయణస్వామి గత ఫిబ్రవరి 4, 2026న యాడికి మండల వ్యవసాయ అధికారి కె. మహబూబ్ బాషాకు సంబంధించి సమాచార హక్కు చట్టం-2005 సెక్షన్ 6(1) కింద ఒక దరఖాస్తు సమర్పించారు. అందులో:

 1. మండల వ్యవసాయ అధికారి సర్వీస్ రిజిస్టర్ జిరాక్స్ కాపీలు,

 2. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)A, 4(1)B కింద కార్యాలయానికి సంబంధించిన 17 రకాల ప్రాథమిక సమాచారం,

 3. యాడికి మండలంలో రైతులకు పంపిణీ చేసిన ఉచిత ట్రాక్టర్లు, మడకలు, ఉచిత విత్తన కిట్లు, సబ్సిడీ రుణాలు మరియు 'రైతు భరోసా' లబ్ధిదారుల పూర్తి పేర్లు, చిరునామాలతో కూడిన ధ్రువీకృత పత్రాలను కోరారు.

చట్టప్రకారం 30 రోజుల్లోగా పూర్తి వివరాలు అందించాల్సి ఉండగా, మార్చి 4న కేవలం అరకొర, అసమగ్ర సమాధానం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు.

 లబ్ధిదారుల జాబితా దాచడం వెనుక అంతర్యమేమిటి?

రైతు సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయడానికి స్థానిక వ్యవసాయ శాఖ ఎందుకు వెనుకాడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా? అర్హులైన వారికే పథకాలు అందాయా లేదా? అనే సందేహాలు ఈ గోప్యత వల్ల మరింత బలపడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజల సొమ్ముతో నడిచే పథకాల వివరాలను పారదర్శకంగా ఉంచాల్సి ఉన్నా, అధికారులు ఆ నిబంధనలను బేఖాతరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

జేడీఏ కార్యాలయంలో అప్పీల్:

ఈ నేపథ్యంలో, తనకు చట్టబద్ధంగా దక్కాల్సిన పూర్తి సమాచారాన్ని ఇప్పించాల్సిందిగా అప్పీలుదారుడు నారాయణస్వామి జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. చట్టాన్ని ఉల్లంఘించిన యాడికి వ్యవసాయ కార్యాలయ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మార్చి 18న అనంతపురం జేడీఏ కార్యాలయంలో సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్ దాఖలు చేశారు. యాడికి మండల వ్యవసాయ సమాచారాన్ని సమగ్రంగా తనిఖీ చేయించి, ప్రతి పేజీని ధ్రువీకరించి ఇప్పించాలని కోరారు. ఈ వ్యవహారంపై జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు స్పందించి, బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!