ఉపాధిలో పచ్చ గద్దలు!

Malapati
0


 


సామాజిక తనిఖీ నిలిపివేత, సందులో సడేమియా! 

పనులు చేయకనే వేతన పంపకాలు!

మార్చ్ 2026 నుండి నేటి వరకు జరిగిన పనులు అన్నింటిపై సిబిఐ విచారణ జరపాలి!

---------------------------

      ఉపాధి హామీ పథకం లో పనులు చేయాల్సిన అవసరం లేదు,ఫోటో తీసుకుంటే చాలు డబ్బులు వచ్చేస్తాయి.ఇదీ నేటి కూటమి ప్రభుత్వం తంతు.ఈ తంతును చూస్తున్న సంబంధిత శాఖా మంత్రి,ప్రశ్నించే పవన్,ఉలుకూ పలుకూ లేదు.

      ఎంజిఎన్ఆర్ఇజిఎ రద్దు అయ్యి,జూలై నెల ఒకటి నుంచి అమలులోకి వస్తున్న జి రామ్ జి బడ్జెట్లో,అటు కేంద్రం,ఇటు రాష్ట్రం,ఈ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడంలో అత్యంత కీలక పాత్రను పోషించే సోషల్ ఆడిట్ కు బడ్జెట్ నిలిపివేసిన కారణంగా సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ(SSAAT) రెండు నెలలుగా పని ఆపేసింది, ఫలితంగా క్షేత్రస్థాయిలో పనుల తనిఖీ జరగడం లేదు,ఈ విషయం తెలుసుకున్న స్థానిక పచ్చ గద్దలు ఎక్కడికక్కడ వాలిపోయి,ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని అందరు ఉపాధి సిబ్బంది,ఎమ్మెల్యే వరకు వాటాలు మాట్లాడుకుని,జాబ్ కార్డులు ఉన్న కూలీల దగ్గరికి వెళ్లి మీరు పని చేయాల్సిన అవసరం లేదు ఫోటోలు దిగితే చాలు కార్డు కు 100 రూపాయల ఇస్తామని చెప్పి నకిలీ మాస్టర్లు తయారుచేసి, జెసిబి లతో పనులు చేసి, పచ్చ మూకలు ప్రజాధనాన్ని పంచుకు తింటున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం జి రామ్ జి పథకాన్ని రాష్ట్రాల నెత్తి మోపిన కారణంగా రాష్ట్రాలు తమ ఇస్టా రీతిన అమలు చేస్తూ,పనులు చేయకనే చేసినట్లు తినేదానికి రంగం సిద్ధం చేసుకున్నాయి.దీన్ని చూసిన ప్రజలు అటు ప్రజాధనం దుర్వినియోగం, ఇటు క్షేత్రస్థాయిలో ఉపయోగకరమైన పనులు లేకపోవడాన్ని చూసి తిన్నవారికి తిన్నంత అనుకుంటూ ఈ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెడుతున్నారు, నిజమైన కూలీలు మాకు రావాల్సిన కూలి దక్కడం లేదని,పనులు పెట్టడం లేదని వలసలకు సిద్ధమవుతున్నారు. 

      ఇప్పటికే ఈ పథకం దుర్వినియోగం అవుతున్నదని,వ్యవసాయ రంగానికి అడ్డుగా ఉన్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేడు జరుగుతున్న ఈ తంతు దానికి మరింత ఊతమిచ్చి శాశ్వతంగా మూసివేసే పరిస్థితికి తెస్తున్నారు. అందుకే నిజమైన కష్టజీవులు ఈ పథకాన్ని రక్షించుకోవడానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ తంతుకు వ్యతిరేకంగా నిలబడాలి,మార్చి 2026 నుండి నేటి వరకు జరిగిన పనులు అన్నింటిపై సిబిఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే కష్ట జీవులు సాధించుకున్న ఈ పని హక్కు ఎండమావే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!