అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గవి మఠం సంస్థానానికి సంబంధించిన భూములను దేవాదాయ శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. విజయవాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.
కర్ణాటక పరిధిలోని మఠం భూములు
శ్రీ గవి మఠం సంస్థానానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ భారీగా భూములు ఉన్నాయి. బళ్లారి జిల్లా, రూపనగుడి తాలూకా, చెళ్ళగూరికి గ్రామ పరిధిలో మఠానికి చెందిన ఈ క్రింది భూములను అధికారులు గుర్తించారు:
సర్వే నంబర్ 111B: 3 ఎకరాల 35 సెంట్లు
సర్వే నంబర్ 114:19 ఎకరాల 05 సెంట్లు
దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఈ భూముల రక్షణకై, సదరు స్థలాల్లో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు మేనేజర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులను పాతడం జరిగింది. ఈ కార్యక్రమంలో మఠం సిబ్బంది, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
త్వరలో బహిరంగ వేలం
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. మఠం ఆస్తులను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం బోర్డులు నాటిన ఈ భూములకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.




