స్పందన అర్జీలపై నిర్లక్ష్యం.. ఏడాది తర్వాత మేల్కొన్న రెవెన్యూ యంత్రాంగం!

Malapati
0

 

 



 'సామాజిక' ప్రేమతోనే గతంలో అన్యాయం: బాధితుడి తీవ్ర ఆరోపణలు

ఉరవకొండ, మే 25:

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా భావించే 'పీజీఆర్‌ఎస్' (స్పందన) అర్జీల పట్ల క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఉరవకొండ మండలంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. తప్పుడు పత్రాల సృష్టి, భూ ఆక్రమణ ఆరోపణలపై దాఖలైన ఒక అర్జీని ఏడాది పాటు తొక్కిపెట్టి, చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం తాజాగా 'నోటీసు-2' జారీ చేస్తూ విచారణకు తెరలేపింది.

 ఏడాది పట్టిన 'స్పందన'.. బాధితుడి ఎద్దేవా!

ఉరవకొండకు చెందిన మీనుగ మధు బాబు (తండ్రి: మీనుగ నాగేంద్ర) బుదగవి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 317-A, 317-B లలో ఉన్న 0.50 ఎకరాలు మరియు 0.17 ఎకరాల భూమికి సంబంధించి 28-07-2025 నాడే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు భూమి విషయంలో భారీ అక్రమాలు, మోసాలు జరిగాయని, తప్పుడు పత్రాలు సృష్టించారని ఆయన మొరపెట్టుకున్నారు.

అయితే, ఈ అర్జీ పరిష్కారానికి అధికారులకు సరిగ్గా ఏడాది కాలం పట్టింది. దీనిపై బాధితుడు మధు బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీజీఆర్‌ఎస్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాదు.. ప్రజా సమస్యలను అస్సలు పట్టించుకోని, పరిష్కరించని వేదిక" అంటూ ఆయన ఎద్దేవా చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ఫలితం శూన్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'సామాజిక' ప్రేమతోనే అన్యాయం.. కేసు రీ-ఓపెన్!

గతంలో పనిచేసిన ఓ తహశీల్దార్, సదరు భూ అక్రమాలకు పాల్పడిన బాధ్యుడు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే, వారి మధ్య 'సామాజిక ప్రేమ' ఒలకబోసి సమస్యను తొక్కేశారని బాధితుడు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నాటి అధికారుల పక్షపాత వైఖరి వల్ల సమస్య మొదటికొచ్చిందని, అందుకే ఈ కేసును పునఃసమీక్షించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరడంతో ఉన్నతాధికారులు స్పందించారు.

 జూన్ 2న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ఈ వివాదంపై సమగ్ర విచారణ నిమిత్తం ఉరవకొండ ప్రస్తుత తహశీల్దార్ ఉరుకుందప్ప నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద భూమిపై హక్కులు, స్వాధీన అనుభవం ఉన్న పక్షాలు తమ వద్ద ఉన్న అసలు (ఒరిజినల్) రికార్డులు, ఆధారాలతో *జూన్ 2, 2026 నాడు ఉదయం 11:00 గంటలకు* తహశీల్దార్ కార్యాలయంలో నేరుగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

ఒకవేళ నిర్దేశిత సమయానికి విచారణకు రాకపోతే, కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే ఏకపక్షంగా తుది నిర్ణయం తీసుకుని, తదుపరి చర్యల కోసం నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని నోటీసులో గట్టిగా హెచ్చరించారు.

ఈ నోటీసు ప్రతులను ఫిర్యాదుదారుడైన మీనుగ మధు బాబుతో పాటు, ప్రతివాది అయిన ఆదోని ఆదాము సాబ్ (తండ్రి: లేట్ నబీ సాబ్) కు పంపడమే కాకుండా, తదుపరి సమాచారం నిమిత్తం గుంతకల్లు రెవెన్యూ డివిజనల్ అధికారి కి కూడా సమర్పించినట్లు తహశీల్దార్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!