పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో బుధవారం ఉరవకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పలుమార్లు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. గతంలో ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో మాత్రం ఇంధన ధరలను తగ్గించలేదని ఆరోపించారు. 2014లో బీజేపీ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 9 వరకు ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. అందులో భాగంగానే ఉరవకొండలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జై మల్లికార్జున, నియోజకవర్గ కార్యదర్శి ఎం.బి. చెన్నరాయుడు, సహాయ కార్యదర్శులు సుల్తాను, నాగేంద్ర, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు చందు, సీనియర్ నాయకులు గన్నె మల్లేష్, గన్నె మోహన్, మహిళా సమాఖ్య నాయకురాళ్లు నూర్జహాన్, వనజాక్షి, వన్నూరమ్మ, సీపీఐ నాయకులు హుస్సేన్, మలరాయుడు, వెంకటేశులు, కాసిం పీరా తదితరులు పాల్గొన్నారు.

