-లోన్ గ్రహీతలను వదిలేసి, పరిచయకర్త ఎఫ్‌డీ ఫ్రీజ్ చేయడం దారుణo
ఉరవకొండ ఎస్.హెచ్.ఓ నివేదికపై బాధితుడు మాలపాటి శ్రీనివాసులు ఆక్షేపణ
రుణం తీసుకున్న అసలు వ్యక్తులను విడిచిపెట్టి, కేవలం ఖాతా పరిచయస్తుడిగా సంతకం చేసిన సామాన్యుడిని వేధింపులకు గురిచేస్తున్న బ్యాంక్ అధికారులు, వారికి కొమ్ముకాస్తున్న పోలీసుల తీరుపై ఉరవకొండకు చెందిన బాధితుడు మాలపాటి శ్రీనివాసులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సమర్పించిన ఏకపక్ష నివేదికను తక్షణమే పక్కనపెట్టి, ఈ వ్యవహారంపై సమగ్ర పునః విచారణ జరపాలని ఆయన ఎస్పీని ఆశ్రయించారు.
అసలు ఏం జరిగింది?
బాధితుడు శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండ కెనరా బ్యాంక్‌లో ఖాతా సంఖ్య 3123140000219 పై శ్రీమతి మేకల కృష్ణవేణి అనే మహిళకు 2014లో రూ. 1,99,000/- రుణం మంజూరైంది. ఈ క్రమంలో శ్రీనివాసులు కేవలం పరిచయకర్తగా సంతకం చేశారు. అయితే, గత 12 ఏళ్లుగా రుణగ్రహీత మేకల కృష్ణవేణి, ఆమె ప్రతినిధి మేకల సుబ్బులు బ్యాంకుకు పైసా కూడా కట్టకుండా ఎగనామం పెట్టారు. దీంతో ఆ రుణం కాస్తా వడ్డీలతో కలిపి ప్రస్తుతం రూ. 10 లక్షలకు చేరింది.
కూతురు పెళ్లి డబ్బులపై బ్యాంకర్ల కన్ను!
అసలు నిందితుల నుంచి లోన్ రికవరీ చేయడంలో పూర్తిగా విఫలమైన బ్యాంక్ అధికారులు.. బాధితుడు శ్రీనివాసులు తన కుమార్తె వివాహం కోసం దాచుకున్న సొంత ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాన్ని చట్టవిరుద్ధంగా హోల్డ్ (ఫ్రీజ్) చేశారు. పరిచయకర్తగా సంతకం పెడితే, నిబంధనలకు విరుద్ధంగా దాన్ని గ్యారంటర్‌గా మార్చి తన సొమ్మును కబ్జా చేయడమేంటని శ్రీనివాసులు బ్యాంక్ మేనేజర్‌ను నిలదీశారు.
పోలీసుల నివేదికపై తీవ్ర ఆక్షేపణ:
గతంలో ఈ విషయమై 'స్పందన'లో ఫిర్యాదు చేయగా, ఉరవకొండ పోలీసులు మేకల సుబ్బును పిలిపించి విచారించారు. ఆ సమయంలో *నెల రోజుల్లో అప్పు తీరుస్తా"* అని సుబ్బు పోలీసుల ముందే ఒప్పుకున్నట్లు ఎస్.హెచ్.ఓ తన నివేదికలో పేర్కొన్నారు.
ఇది సివిల్ వివాదం అయితే, పోలీసులు తమ సమక్షంలో అప్పు తీర్చడానికి ఒక నెల గడువు ఇచ్చే అధికారాన్ని ఏ చట్టం ప్రకారం ఉపయోగించారు? గడువు ముగిసినా నిందితుడు రూపాయి చెల్లించనప్పుడు అది ముమ్మాటికీ క్రిమినల్ నమ్మకద్రోహం కిందకే వస్తుంది. అలాంటిది సమస్య పరిష్కారం కాకుండానే, పరిష్కారమైందని ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇవ్వడం అసంబద్ధం" అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్పీ గారికి విజ్ఞప్తి:
ఈ వ్యవహారంలో అసలు రుణగ్రహీత మేకల కృష్ణవేణిని పోలీసులు కనీసం స్టేషన్‌కు పిలిపించి విచారించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని బాధితుడు ప్రశ్నించారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన క్రిమినల్ మోసమని, కావున జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకుని ఉరవకొండ పోలీసుల పక్షపాత నివేదికపై విచారణ జరపాలని, నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తన ఎఫ్‌డీ అకౌంట్‌పై ఉన్న అక్రమ హోల్డ్‌ను తొలగించి తనకు న్యాయం చేయాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

