ఉరవకొండకు చెందిన మీనుగ మధుబాబు దాఖలు చేసిన ఫిర్యాదు (సంఖ్య: 2556/2021/B2)పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలుమార్లు నివేదికలు కోరినా స్పందన లేకపోవడంతో, ఈసారి అత్యవసరంగా స్పందించాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 246 ప్రకారం గ్రామ పంచాయతీ తీసుకున్న అక్రమ తీర్మానాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. అక్రమంగా కేటాయించిన భూములను తిరిగి పంచాయతీ స్వాధీనంలోకి తీసుకుని, వాటికి కంచె ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే ఈ అక్రమాలకు బాధ్యులైన అప్పటి సర్పంచ్‌లు, సంబంధిత అధికారులపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్ కార్యాలయం పేర్కొంది.
అధికారుల నిర్లక్ష్యంపై అసహనం
ఈ కేసులో నివేదికలు సమర్పించడంలో జరుగుతున్న ఆలస్యంపై కమిషనర్ కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే నాలుగు సార్లు మెమోలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ఐదోసారి “అత్యంత అత్యవసరం”గా గుర్తిస్తూ రిమైండర్ జారీ చేసింది.
కమిషనర్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి టి. నాగరాజ నాయుడు చర్యలకు దిగారు. గుంతకల్లు డివిజనల్ పంచాయతీ అధికారి, ఉరవకొండ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజుల్లో పూర్తి స్థాయి ‘చర్య తీసుకున్న నివేదిక’ సమర్పించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
“లోకాయుక్తకు సంబంధించిన కేసు కావడంతో దీనికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. గడువు మించకుండా అన్ని రికార్డులతో నివేదిక సమర్పించాలి” అని జిల్లా పంచాయతీ అధికారి స్పష్టం చేశారు’’.
ఈ పరిణామంతో ఉరవకొండలో అక్రమ భూ కేటాయింపులకు పాల్పడిన వారిలో కలకలం రేగింది. ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు ఎంతవరకు సఫలీకృతమవుతారో చూడాల్సి ఉంది.
