హంద్రీ-నీవా ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక డిమాండ్

Malapati
0

అనంతపురం, ఏప్రిల్ 21: రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా భావించే హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. వేదిక అధ్యక్షుడు కేవి రమణ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఆరోపణలు చేశారు.

దేశంలో అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమలో తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించాల్సిన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు, ప్రజల ఆశలకు భిన్నంగా అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారాయని ఆయన పేర్కొన్నారు. మొదటి దశ కాలువ వెడల్పు, రెండవ దశ లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.3,850 కోట్లకు పైగా నిధులు కేటాయించి టెండర్లు పిలిచి పనులు అప్పగించిందని తెలిపారు.
ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిశీలనలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వేదిక ఆరోపించింది. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్స్‌లో లైనింగ్ పనులు దెబ్బతినడం, గట్లు కోతకు గురవడం, నిర్మాణాలు బలహీనంగా ఉండటం వంటి సమస్యలు బయటపడినట్లు పేర్కొన్నారు.ఇంజనీరింగ్ ప్రమాణాలను పాటించకుండా పనులు చేపట్టడం వల్ల ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని, రైతులకు ఆశించిన మేర ప్రయోజనం అందలేదని కేవి రమణ ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నీటి ప్రవాహ సామర్థ్యం, వాస్తవ ప్రవాహంలో వ్యత్యాసాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
అంతేకాక, ప్రాజెక్టు పనులు కొన్ని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించడంలో అనుమానాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణలో లోపాలు ఉన్నాయని వేదిక అభిప్రాయపడింది. ఈ కారణంగా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.
రెండో దశ కాలువ పనులు పూర్తయిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం నమోదు కాలేదని, ఇది ప్రాజెక్టు సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వేదిక తెలిపింది. భూగర్భ జలాల పెరుగుదల కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో హంద్రీ-నీవా ప్రాజెక్టులో జరిగిన అన్ని పనులపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, సీబీఐ రంగంలోకి దిగి నిజాలను వెలికితీయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. తప్పిదాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవి రమణ ప్రభుత్వాన్ని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!