ప్రజలకు మరింత చేరువగా పాలన – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, పాల్గొననున్నారని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు సంబంధించిన సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. ప్రజలకు ఎదురవుతున్న వివిధ సమస్యలు, అభ్యర్థనలు, వినతులను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకునే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని పేర్కొంది. ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతులు లేదా ఇతర సమస్యలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులతో కార్యక్రమానికి హాజరుకావచ్చని తెలిపింది. ప్రజల సమస్యల పరిష్కారంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు కొనసాగిస్తున్నారని వివరించింది. ఈ సందర్భంగా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకురావాలని మంత్రి కార్యాలయం కోరింది.

