మహిళా హక్కుల సాధనకు ఉద్యమాలు మరింత బలోపేతం కావాలి

Malapati
0


 



మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం సాధన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న జిల్లా వ్యాప్త జీప్ జాతాకు శుక్రవారం ఉరవకొండలో మహిళలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించిన జాతా బృందం ఉరవకొండకు చేరుకోగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు, దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పించడంతో పాటు డీలిమిటేషన్ షరతులు లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో బెల్ట్ షాపులు, మద్యం విక్రయాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతుండటంతో పాటు మహిళలపై గృహహింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు పంట నష్టపరిహారం, రుణమాఫీ అమలు చేయాలని కోరారు. విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణను నిలిపివేసి ప్రభుత్వ సేవలను బలోపేతం చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని పేర్కొన్నారు.

మహిళల సమస్యల పరిష్కారం, సామాజిక సమానత్వం కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా హక్కుల పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో మహిళా సంఘాల జిల్లా కోశాధికారి లక్ష్మీదేవి, గుంతకల్లు మహిళా సంఘం అధ్యక్షురాలు సారాంబి, ఉరవకొండ కార్యదర్శి నూర్జహాన్, వన్నూరమ్మ, శకుంతల, రాజి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!