డిసెంబర్ 9,2025 లోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక,గ్రౌండ్ పరిశీలనలో బయటపడ్డ నిజాలు!
జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరపాలి
హంద్రీ-నీవాలో నీళ్లకు బదులు అవినీతి వేగంగా పారుతున్నది.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆగమేఘాల మీద డిసెంబర్ 3,2024 న హంద్రీ-నీవా మొదటి దశ వెడల్పు,రెండవ దశ లైనింగ్ పనులకు 3850 కోట్లు ఖర్చు చేసి 100 రోజులలో పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నది.మొదటి దశ వెడల్పు పనులకు 950 కోట్లు,రెండవ దశ లైనింగ్ పనులకు సుమారు 2900 కోట్లకు టెండర్లు పిలిచి తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.
రెండవ దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను కళ్యాణదుర్గం టిడిపి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కు సంబంధించిన ఎస్సార్ కన్స్ట్రక్షన్ కు కట్టబెట్టారు. ఈ కంపెనీ సదరు పనులను నాసిరకంగా చేయడం వల్ల గత ప్రవాహానికే కొట్టుకుపోయింది.ఈ పనులు నాణ్యతగా ఉండాలంటే మొదట కాలువపై కంప చెట్లను తొలగించి అడుగు భాగంలో ఇంక్లైన్డ్ రోలర్ తో గట్టిపరచి ఆ తర్వాత 12 ఎం ఎం,20 యం యం గ్రానైట్ కంకర,నాణ్యమైన ఇసుక,సిమెంట్ తో తయారు చేసిన ఎం 25 మిక్చర్ తో ఫేవర్ మిషన్ ద్వారా కాలువ ఇరువైపులా లైనింగ్ చేయాలి.ఆ తరువాత అడుగు భాగంలో లైనింగ్ వేసి దీనిని రెండు వారాలపాటు క్యూరింగ్ చేయాలి.ఎక్కడైనా రాతి పొరలు ఉన్న ప్రాంతంలో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి,ఈ పనులను జరుగుతున్నప్పుడు సంబంధించిన ఇంజనీర్లు నిరంతరం దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి,సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్ ను తీసి లేబరేటరీ లో పరీక్ష చేసి నాణ్యతను ధ్రువీకరించాలి, ఇవేవీ లేకనే పనులు పూర్తి చేసేశారు.ఈ లోపాలను డిసెంబర్ 9,2025న కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నప్పుడే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర కమిటీ పరిశీలనలో బయటపడింది. ఆనాడే కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు,నేడు ప్రవాహం నిలిచిపోయిన తర్వాత సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ లో సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్, కదిరి మండలం కొండమనాయుడుపాలెం, నల్లచెరువు మండలం కళ్లిపల్లి,తనకల్లు మండలం దిగువ తొట్లిపల్లి వద్ద లైనింగ్ పూర్తిగా కొట్టుకుపోయిన దృశ్యాలను చూస్తే ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో తెలుస్తుంది.
207.20 కోట్లకు దక్కించుకున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్,నిబంధనలను బేఖాతరు చేసి,పని స్వభావాన్ని మార్చేసి,స్టీల్ ఫైబర్ రియిన్ ఫోర్స్ కాంక్రీట్ విధానంలో చక చకా లైనింగ్ పనులు చేసేసారు, మట్టిని అమ్ముకోవడానికి కాలువ గట్టు వాలును సరిచేయకుండానే ఎస్ ఎఫ్ ఆర్ సి తో లైనింగ్ చేశారు,దాని ఫలితంగానే లైనింగ్ మొత్తం కొట్టుకుపోయింది.అయినా సదరు ఎస్సార్ కన్స్ట్రక్షన్ గత ఏడాదే లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.వాస్తవంగా ఇంకా 30% మేర లైనింగ్ పనులు మిగిలిపోయాయి, నాసిరకంగా చేసిన పనులకు జరిమానా వేయాడానికి బదులు.పనులు అంచనా వ్యయాన్ని 207.20 కోట్ల నుండి 4-5-2026న 102 కోట్లకు పెంచి కాంట్రాక్టర్ కు బహుమతి ఇచ్చి ఈ ప్రభుత్వం అవినీతికి అంబాసిడర్ గా మారింది.
రెండవ దశ కింద చేసిన పనులు లైనింగ్ కాబట్టి బయటి కనబడుతున్నది. వెడల్పు పేరుతో చేసిన మొదటి దశ పనులు కేవలం క్లీన్ చేసి బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తుంది, ఈ పనులు నీటి ప్రవాహానికి కనిపించవు.నిజంగానే వెడల్పు చేసి ఉంటే ప్రతిరోజు 3850 క్యూసెక్కులు నీరు వచ్చి ఉండాలి,అలా వచ్చి ఉంటే మూడు రోజులకు ఒక టిఎంసి రావాలి,ఈసారి 8 నెలల కాలం కాలువలో నీళ్లు ప్రవహించాయి,అంటేమూడు రోజులకు ఒక టీఎంసీ,నెలకు పది టీఎంసీల ప్రకారం 8 నెలలకు 80 టీఎంసీలు వచ్చి ఉండాలి.అయితే అధికారికంగా 50 టీఎంసీలు మాత్రమే వచ్చినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.దీనిని బట్టి కాలువ వెడల్పు పనులు జరగలేదని అర్థం అయిపోతుంది.
ఈ విధంగా కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల పేర్లతో నీళ్లకు బదులు అవినీతిని పారిస్తున్నది.రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నది.
3850 కోట్ల విలువ కలిగిన హంద్రీ-నీవా పనులపై సిబిఐ విచారణ చేసి,పనుల నాణ్యతను,జరిగిన అవినీతిని తేల్చి సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం

